మరి ఆ 30 శాతం మాటేమిటి?
సర్క్యులర్ వెనుక ఉన్న అసలు అర్థం ఇదే!
హైదరాబాద్, లీగల్ రిపోర్టర్: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అంశంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. హై పవర్డ్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం మేరకు, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు బార్ కౌన్సిల్ సెక్రటరీ గురువారం (జనవరి 9, 2026) సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో “కనీసం 5 సీట్లు (Minimum 5 Seats)” మహిళలకు కేటాయించాలని పేర్కొన్నారు.

అయితే, గత కొంతకాలంగా బార్ కౌన్సిల్ లో 33 శాతం లేదా 30 శాతం రిజర్వేషన్ అమలు అవుతుందని, దాని ప్రకారం 25 సీట్లలో 7 లేదా 8 సీట్లు మహిళలకు దక్కుతాయని న్యాయవాద వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. మరి ఇప్పుడు సర్క్యులర్ లో “5 సీట్లు” అని ఎందుకు ఉంది? దీని వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటి?
‘కనీసం 5’ అంటే అర్థం ఏంటి? సర్క్యులర్ లో వాడిన పదం “Minimum of 5 seats”. అంటే దీని అర్థం మహిళలకు కేవలం 5 సీట్లు మాత్రమే ఇస్తారని కాదు.
ఫ్లోర్ లిమిట్: ఇది కనీస సంఖ్య మాత్రమే. ప్రత్యక్ష ఎన్నికల్లో (Direct Election) పోటీ చేసి 8 మంది లేదా 10 మంది మహిళలు గెలిచినా వారికి ఆ సీట్లు దక్కుతాయి. దానికి అభ్యంతరం లేదు.
కో-ఆప్షన్ రక్షణ: ఒకవేళ ఎన్నికల్లో ఒక్క మహిళ కూడా గెలవకపోయినా, లేదా తక్కువ మంది గెలిచినా.. కౌన్సిల్ లో మహిళల సంఖ్య ‘5’ కి తగ్గకూడదు. ఆ సంఖ్యను భర్తీ చేయడానికి ‘కో-ఆప్షన్’ (Co-option) పద్ధతిలో మిగిలిన వారిని నామినేట్ చేస్తారు.
సుప్రీం తీర్పు కోసమే వెయిటింగ్? వాస్తవానికి మహిళా న్యాయవాదులు కోరుతున్న 30 శాతం వాటా (సుమారు 8 సీట్లు) అంశం ఇంకా సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సర్క్యులర్ చివరిలో.. “మహిళా ప్రాతినిధ్యంలో ఇంకా ఏదైనా లోటు (Deficiency) ఉంటే, అది సుప్రీంకోర్టు ఇచ్చే తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటుంది” అని స్పష్టంగా పేర్కొన్నారు.
అంటే, రేపు సుప్రీంకోర్టు “8 సీట్లు ఇవ్వాల్సిందే” అని తీర్పు ఇస్తే, ఈ సంఖ్య 5 నుండి 8కి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ‘5 సీట్ల గ్యారెంటీ’తో ఎన్నికలు ముందుకు సాగనున్నాయి.
