Thu. Feb 26th, 2026

వనపర్తి, లీగల్ రిపోర్టర్: పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించడం అత్యంత ఆవశ్యకమని, ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి. రజని హెచ్చరించారు. గురువారం వనపర్తి జిల్లా ఐడీవోసీ (IDOC) సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘లోకల్ కంప్లైంట్ కమిటీ’ (Local Complaint Committee) ప్రత్యేక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జడ్జి వి. రజని మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారికి సురక్షితమైన పని వాతావరణం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, ఇళ్లలో పనిచేసే మహిళల రక్షణ కోసం జిల్లా స్థాయిలో లోకల్ కంప్లైంట్ కమిటీలను, ఆఫీసుల్లో ఇంటర్నల్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

బాధితులు ఏం చేయాలి?

వేధింపులకు గురైన మహిళలు సంకోచించకుండా లోకల్ కంప్లైంట్ కమిటీలో ఫిర్యాదు చేయాలి.

ఘటన జరిగిన 90 రోజుల్లోపు కమిటీకి గానీ, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘షి-బాక్స్’ (She-Box) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో గానీ ఫిర్యాదు చేయవచ్చు.

ఆరోపణలు రుజువైతే నిందితులకు తగిన శిక్షలు పడతాయి.

ఈ చట్టంపై కేవలం మహిళలకే కాకుండా, పురుషులకు కూడా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.

64 శాఖల్లో కమిటీలు: డీఎస్పీ బాలాజీ నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలోని 64 ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఇంటర్నల్ కమిటీలు (ICC) ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, లోకల్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీలేఖ, జి.సి.డి.ఓ సుబ్బలక్ష్మి, శ్రీదేవి, రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ చిన్నమ్మ థామస్, డి.సి.పి.ఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *